భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
తో భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జీ7
సదస్సుకు రావాలని మోదీని కిషిద ఆహ్వానించారు. ఇందుకు మోదీ సుముఖత వ్యక్తం
చేశారు. భారత్- జపాన్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని
ఇరుదేశాల ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి,
సుస్థిరతలు నెలకొనడానికి రెండు దేశాల సంబంధాలు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ,
జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిద అభిప్రాయపడ్డారు. భారత్, జపాన్ మధ్య బలమైన
సంబంధాలు రెండు దేశాలకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. భారత పర్యటన నిమిత్తం
ఢిల్లీ కి చేరుకున్న కిషిదతో మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో చైనా
దూకుడు, రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ
వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం జీ7 దేశాల కూటమికి జపాన్
నేతృత్వం వహిస్తున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. భారత్ ప్రస్తుతం జీ20కి
నాయకత్వం వహిస్తోందని అన్నారు. కీలక అంశాలపై పనిచేసి, ప్రపంచ శ్రేయస్సు కోసం
పాటుపడేందుకు ఇదే సరైన సమయమని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. జీ20 కూటమి
అధ్యక్ష హోదాలో భారత్ చేపట్టనున్న కీలక కార్యక్రమాల గురించి కిషిదకు
వివరించినట్లు మోదీ తెలిపారు. రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, వాణిజ్యం,
పెట్టుబడులు, వైద్య రంగాల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యంపై తాము చర్చించినట్లు
మోదీ పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల కోసం విశ్వసనీయమైన సప్లై చైన్ ఉండాల్సిన
ఆవశ్యకతపై సమాలోచనలు చేసినట్లు తెలిపారు.