వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ బడ్జెట్ను
ప్రతిపాదించారు. 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఫెడరల్ ప్రభుత్వానికి
సంబంధించి అందులో 6.9 లక్షల కోట్ల డాలర్ల వ్యయ ప్రతిపాదనలు చేశారు. రాబోయే
దశాబ్ద కాలంలో ద్రవ్యలోటును 2.9 లక్షల కోట్ల డాలర్ల మేర తగ్గించే ప్రణాళికలను
పొందుపరిచారు. తాజా బడ్జెట్లోని ప్రతిపాదనల ప్రకారం- దేశంలోని సంపన్నులపై
పన్నుల భారాన్ని ప్రభుత్వం పెంచనుంది. 10 కోట్ల డాలర్లకు పైగా వార్షిక ఆదాయం
ఉన్న వ్యక్తులపై కొత్త పన్ను విధించనుంది. ఏడాదికి 4 లక్షల డాలర్లకుపైగా ఆదాయం
ఉన్న పౌరులు చెల్లించే పన్నులను తగ్గిస్తూ 2017లో అప్పటి ట్రంప్ సర్కారు
కల్పించిన ఉపశమనాలను ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది.
అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ. వారు బైడెన్
బడ్జెట్ ప్రతిపాదనలను ఎంతమేరకు ఆమోదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
‘ఇండో-పసిఫిక్’ కోసం 2,500 కోట్ల డాలర్లు : వ్యూహాత్మకంగా కీలకమైన
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు గట్టిగా
ప్రయత్నిస్తున్న అమెరికా.. తాజాగా కీలక ముందడుగు వేసింది. ఆ ప్రాంతంలో మౌలిక
వసతులను మెరుగుపర్చేందుకు, తమ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునేందుకు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బడ్జెట్లో ఏకంగా 2,500 కోట్ల డాలర్ల నిధుల
వ్యయానికి ప్రతిపాదించారు. చైనాకు ముకుతాడు వేయడానికి, అమెరికా సురక్షితంగా
ఉండటానికి ఈ నిధులు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.