బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయాలనుకున్న నిరాహార దీక్షకు లైన్ క్లీయర్ అయింది.
కవిత దీక్షకు జంతర్ మంతర్ వేదిక ఖరారు కాగా లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా
ఢిల్లీ బీజేపీ నేతలు చేయాలనుకున్న ధర్నా జంతర్‌మంతర్ నుంచి దీన్‌దయాళ్
మార్గ్‌కు మారింది. దీన్‌దయాళ్ మార్గ్‌లోని ఆంధ్రా స్కూల్ దగ్గర బీజేపీ
ధర్నా నిర్వహించనుంది. దీంతో శుక్రవారం ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ
నిరసనలు నిర్వహించనున్నాయి. ఒకరోజు ముందే హస్తిన చేరుకున్న కవిత ఇవాళ ఉదయం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు లో ఈడీ నోటీసులపై స్పందించారు. 9న విచారణకు
రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందని, 11న విచారణకు తమ ఇంటికి రమ్మని ఈడీని
కోరానన్నారు. ఈమేరకు ఈడీకి సమాచారం ఇచ్చినా ఈడీ ఒప్పుకోలేదన్నారు.
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు విచారించరని కవిత ప్రశ్నించారు. దర్యాప్తు
సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని, మహిళలను
విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఇది తన ఒక్క
సమస్యే కాదని, ఈడీ ఎందుకింత హడావుడిగా దర్యాప్తు చేస్తుందో అర్థం కావడం లేదని
కవిత చెప్పారు. తనతోపాటు ఎవర్ని విచారించినా తనకు ఇబ్బంది లేదన్నారు.
ఎన్నికల నేపథ్యంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని
కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది
సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలతో
తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ పార్టీకి చెందిన సుమారు
15 మంది నేతలపై దర్యాప్తు సంస్థల దాడులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. మోదీ
వన్ నేషన్ – వన్ ఫ్రెండ్ స్కీమ్ తెచ్చారని, విపక్షాలను టార్గెట్ చేయడం పనిగా
పెట్టుకున్నారని ఆరోపించారు. అధిక ధరలు, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం
చేయాలని ఆమె కేంద్రానికి సలహా ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు
బీజేపీలో చేరగానే క్లీన్చిట్ ఇస్తున్నారని కవిత చెప్పారు. తాము ఎవరికీ బీ
టీమ్ కాదని, ఎప్పటికీ ఏ టీమేనన్నారు. తన తండ్రి, సోదరుడితో పాటు పార్టీ
మొత్తం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ నేతల్ని విచారించడం కేంద్రానికి
అలవాటైపోయిందన్నారు. మోదీ పార్లమెంట్లో కూడా అబద్దాలు చెబుతున్నారని, గాంధీ
పుట్టిన దేశంలో అబద్ధం రాజ్యమేలుతోందన్నారు. మోదీ ఎన్ని కుట్రలు చేసినా ధర్మం
గెలుస్తుందని కవిత చెప్పారు. తాను ధైర్యంగా ఈడీ విచారణకు వెళ్తున్నా బీఎల్
సంతోష్ ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లు కోసం 27
ఏళ్లుగా పోరాటం జరుగుతోందని కవిత చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లు
ఆమోదం పొందలేదన్నారు. 2014, 2018 మహిళా బిల్లుపై బీజేపీ మ్యానిఫెస్టోలో హామీ
ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారని
విమర్శించారు. మహిళా బిల్లు ఆమోదం కోసం ఈ నెల 10న ఢిల్లీలో నిరాహార దీక్ష
చేపడతానని, శుక్రవారం ధర్నాలో 18 పార్టీలు పాల్గొంటాయని ఆమె చెప్పారు. పూర్తి
మెజార్టీతో గెలిపించినా మహిళా బిల్లుపై బీజేపీ మాట తప్పిందని, మహిళా బిల్లుపై
రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడంలో సోనియా
పాత్ర అమోఘమని కవిత చెప్పారు.