ఐక్యరాజ్యసమితి : ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను కాలరాస్తున్నారని, ఈ పద్ధతి
మారకపోతే స్త్రీ-పురుష సమానత్వమనేది మరో 300 ఏళ్ల వరకూ సాధ్యం కాదని
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల స్థితిగతులపై ఐరాస కమిషన్
ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘స్త్రీ-పురుష సమానత్వంలో గడచిన
కొన్ని దశాబ్దాల నుంచి సాధించిన ప్రగతి క్షీణిస్తోంది. పితృస్వామ్యం
స్త్రీ-పురుష సమానత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. అఫ్గానిస్థాన్లో ప్రజా
జీవనం నుంచి మహిళలు, బాలికలను గెంటేస్తున్నారు. పలు దేశాల్లో మహిళల లైంగిక,
గర్భధారణ హక్కులను హరిస్తున్నారు’ అని పేర్కొన్నారు. యుద్ధాలు, సంక్షోభాలకు
మొదట బలయ్యేది బాలికలు, మహిళలేనని చెప్పారు. సాంకేతిక రంగంలో ప్రతి ఇద్దరు
పురుషులకు ఒక మహిళే పని చేస్తున్నారని, కృత్రిమ మేధ రంగంలో ప్రతి అయిదుగురు
సిబ్బందిలో ఒక్కరే మహిళని చెప్పారు. తరగతి గదుల నుంచి కంపెనీల బోర్డులు,
ప్రభుత్వ యంత్రాంగం వరకూ సైన్స్, టెక్నాలజీల్లో మహిళా భాగస్వామ్యం పెంచడానికి
కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ అఖాతం లింగ అసమానత్వానికి కొత్త రూపమని
కమిషన్ డైరెక్టరు సీమా బహూస్ చెప్పారు. అఫ్గానిస్థాన్లో యూట్యూబ్ ద్వారా
తమ సమస్యలను చెప్పుకొన్న మహిళల ఇళ్లపై తాలిబన్లు గుర్తులు పెట్టారని, ఆ
మహిళల్లో చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపారు. ఇరాన్లో ఆన్లైన్
ఉద్యమాల్లో పాల్గొంటున్న మహిళలపై దమనకాండ సాగుతోందని వెల్లడించారు. కమిషన్
రెండు వారాలపాటు జరిపే ఈ సమావేశం సాంకేతిక పరిజ్ఞానం, నవీకరణల రంగాల్లో మహిళల
భాగస్వామ్యాన్ని పెంచే మార్గాల గురించి చర్చించనుంది.