న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో దేశ ప్రజలకు ఎదురవుతున్న అన్యాయాన్ని
ఎదిరించేందుకు ఒక నూతన వేదికను తీసుకురానున్నట్లు రాజ్యసభ సభ్యుడు కపిల్
సిబల్ ప్రకటించారు. ఈ నెల 11న జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే సమావేశంలో
‘ఇన్సాఫ్’ అనే వేదికను, ‘ఇన్సాఫ్ కి సిఫాయీ’ అనే వెబ్‌సైట్‌ను
ప్రారంభిస్తున్నట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి
ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, నాయకులతో పాటు సాధారణ ప్రజలందరినీ
ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇన్సాఫ్ అనేది జాతీయస్థాయి వేదిక అని ఇందులో
న్యాయవాదులు ప్రధాన పాత్ర పోషిస్తారని సిబల్ పేర్కొన్నారు. ఇది ప్రజల వేదిక
అని, తాను ఎలాంటి రాజకీయ పార్టీ స్థాపించడం లేదన్నారు. ప్రతిచోటా
క్షేత్రస్థాయి శాఖల ద్వారా భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఆర్ఎస్ఎస్ పైనా
ఈ వేదిక ద్వారా పోరాడతామని సిబల్ స్పష్టం చేశారు. తాను మోదీని
విమర్శించడానికి రాలేదని, సంస్కరించడానికి వచ్చానని వ్యాఖ్యానించారు.