న్యూఢిల్లీ : దేశ ఆర్థికవ్యవస్థకు చోదకశక్తి లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి
టాప్‌గేర్‌లో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అప్పుడే 2047కల్లా
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యాన్ని సాధించగలమని తెలిపారు.
శనివారం పోస్ట్ – బడ్జెట్ వెబినార్‌లో మోదీ మాట్లాడుతూ దేశంలో మౌలిక
సదుపాయాల మెరుగుదలకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను గుర్తు చేశారు. ‘‘మౌలిక
సదుపాయాలు, పెట్టుబడి : పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ప్లాన్‌తో లాజిస్టిక్
సామర్థ్యాన్ని మెరుగుపరచడం’’ అనే అంశంపై ఈ సందర్భంగా ప్రధాని తన అభిప్రాయాలను
వెల్లడించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న
ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2023-24లోని వివిధ కోణాలను వివరించేందుకు
ప్రధాని వరుస వెబినార్లను నిర్వహిస్తున్నారు. తాజా బడ్జెట్ దేశంలో మౌలిక
సదుపాయాలకు కొత్త శక్తిని ఇస్తుందని మోదీ చెప్పారు. 2013-14తో పోల్చితే భారత
మూలధన వ్యయం అయిదు రెట్లు పెరిగిందన్నారు. జాతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థపై
రూ.110 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు
సాగుతోందని ప్రధాని తెలిపారు. ప్రతి వాటాదారు కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు,
సాహసోపేతమైన నిర్ణయాలు అందిపుచ్చుకునే సమయమిదని అన్నారు. దశాబ్దాల తరబడి
పేదరికాన్ని తీవ్రంగా పరిగణించక గత ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల రంగంలో
పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని మోదీ తెలిపారు. ఈ పరిస్థితి
నుంచి దేశాన్ని తాము బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఫలితంగా 2014తో పోల్చితే
జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వేలైన్ల విద్యుదీకరణ, విమానాశ్రయాల విస్తరణ
వంటివి కొన్ని రెట్లు పెరిగాయన్నారు. పీఎం గతిశక్తి మాస్టర్‌ప్లాన్ మౌలిక
సదుపాయాల రంగంలో దేశ ముఖచిత్రాన్ని మారుస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
దేశంలో పటిష్ఠమైన సామాజిక మౌలిక సదుపాయాల ఆవశ్యకత కూడా అంతే ముఖ్యమని, తద్వారా
మరింత నైపుణ్యమున్న యువత దేశానికి లభిస్తుందన్నారు.