న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం అంశంలో మద్యం విధాన రూపకల్పనకు ఆమోద ముద్ర వేసిన
అప్పటి గవర్నర్ అనిల్ బైజాల్‌ను కూడా విచారించాలని ఆప్ డిమాండ్ చేసింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో అధికార ఆమ్
ఆద్మీ పార్టీ మరో స్వరం అందుకుంది. మద్యం విధాన రూపకల్పనకు అప్పట్లో
లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ ఆమోదముద్ర వేశారని ఆప్ ఢిల్లీ
కన్వీనర్ గోపాల్ రాయ్ అన్నారు. ఈ కేసులో అతడిని కూడా విచారించాలని
డిమాండ్ చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియాను సీబీఐ అరెస్టు చేసిన
నేపథ్యంలో ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
ఈ సందర్భంగా గోపాల్‌రాయ్ మాట్లాడుతూ ఓ పథకం ప్రకారం సిసోదియాను ట్రాప్‌లో
ఇరికించారని ఆరోపించారు. మద్యం విధానానికి సంబంధించిన పత్రాలపై ఆమోదముద్ర
వేసింది అప్పటి ఎల్జీ అనిల్ బైజాల్. అలాంటప్పుడు ఆయన్ని ఎందుకు ప్రశ్నించడం
లేదు. దర్యాప్తు సంస్థలన్నీ పారదర్శకంగా వ్యవహరిస్తే ఆయన్ని కూడా ప్రశ్నించాలి
కదా. సిసోదియాపై కుట్ర జరిగిందనడానికి ఈ ఒక్క విషయం చాలని గోపాల్ రాయ్
విమర్శించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ చాలా చోట్ల ఆధారాలు
సేకరించిందని, అయితే, సిసోదియాకు వ్యతిరేకంగా ఎక్కడా ఆధారాలు లభ్యం కాలేదని
అన్నారు. కోర్టు 5 రోజులు కస్టడీకి అనుమతించినప్పటికీ సీబీఐ అధికారులకు ఏ
ఆధారాలు దొరకవని అన్నారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ..
ప్రధాని మోదీకి స్నేహితుడని చెప్పిన గోపాల్ రాయ్.. అందుకే ఆయనపై ఈడీ, సీబీఐ
దర్యాప్తు చేపట్టడం లేదని అన్నారు.