అమెరికా : యుద్ధంలో ఉక్రెయిన్ను అణగదొక్కేస్తామని పుతిన్ ఇంకా
నమ్ముతున్నాడంట. ఈ విషయాన్ని ఆమెరికా సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్
వెల్లడించారు. ఉక్రెయిన్ను యుద్ధంలో క్రమేపీ అణచివేయొచ్చని పుతిన్ ఇప్పటికీ
ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్
పేర్కొన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవంబర్లో రష్యా ఇంటెలిజెన్స్
సర్వీస్ నవంబర్ మీటింగ్ వారి నమ్మకాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.
ఇప్పటికీ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలనని, ఐరోపాలోని మా మిత్రులను
అధిగమించగలనని, రాజకీయంగా వారు అలసిపోతారని పుతిన్ భావిస్తున్నారన్నారు.
‘‘ప్రస్తుతం పుతిన్ తన సామర్థ్యంపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని నేను
భావిస్తున్నాను. ఉక్రెయిన్ను ఓడిస్తానని నమ్ముతున్నారు. ఒక దశలో అమాయక
రష్యన్ల ప్రాణనష్టం పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని బర్న్స్
పేర్కొన్నారు.
ఈ యుద్ధం విస్తరిస్తున్న విధానాన్ని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ జాగ్రత్తగా
గమనిస్తున్నారని విలియం బర్న్స్ పేర్కొన్నారు. మరోవైపు రష్యాకు ప్రమాదకర
ఆయుధాలు చైనా నుంచి సరఫరా అయ్యే అవకాశం ఉందని బైడెన్ సర్కారు బలంగా
విశ్వసిస్తోంది. ఒక వేళ చైనా నుంచి ఆయుధ సరఫరా జరిగితే అది నిజంగా చాలా పెద్ద
తప్పుగా మిగులుతుంది. చైనా-అమెరికా మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయన్నారు.
2027లో తైవాన్ను ఆక్రమించడానికి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే చైనా అధ్యక్షుడు
జిన్పింగ్ సైన్యానికి చెప్పారని విలియం బర్న్స్ పేర్కొన్నారు. తాజాగా
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని చూశాక చైనా సైనిక సామర్థ్యంపై జిన్పింగ్ మనసులో
కొన్ని సందేహాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు చెప్పారు. తైవాన్ను
నియంత్రించాలనే జిన్పింగ్ కోర్కెను అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందని
పేర్కొన్నారు.