రాత్రంతా వాహనాల్లోనే ప్రయాణికులు
విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం
లాస్ఏంజెలెస్ : అమెరికాలోని తీర ప్రాంతాలను శీతాకాలపు మంచు తుపానులు
వణికిస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియా, ఒరిగన్ రాష్ట్రాలను శుక్రవారం
తీవ్రమైన మంచు తుపాను తాకింది. దీంతో అనేకచోట్ల రహదారులపై రాకపోకలు
నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం 2,000 విమాన సర్వీసులు
నిలిచిపోగా, మరో 14,000 ఆలస్యంగా నడిచాయి. ఇప్పటికీ దాదాపు పది లక్షల గృహాలు
దిగ్బంధనంలో ఉన్నాయి. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. శనివారం మంచు తుపాను
తీవ్రరూపం దాల్చొచ్చని జాతీయ వాతావారణ విభాగం అధికారులు హెచ్చరించారు.
లాస్ఏంజెలెస్ సమీపంలోని పర్వతాలపై అయిదు అడుగుల మేర మంచు పేరుకుపోవచ్చని,
అక్కడ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు హిమనీనాదాలు విరిగిపడే
ప్రమాదాన్ని పెంచుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
దక్షిణ కాలిఫోర్నియా పర్వత ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై ప్రయాణాలు
చేయొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే మైదాన ప్రాంతాలు, ఉత్తర
అమెరికాలోని రాష్ట్రాలను తుపానులు దెబ్బతీయగా ఈ వారాంతం వరకు మంచు, శీతల
గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఒరిగన్
రాష్ట్రంలోని పోర్ట్లాండ్లో అత్యధికంగా 30 సెంటిమీటర్ల మేర మంచు కురిసింది.
దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి, రోడ్లపై వాహనదారులు చిక్కుకున్నారు.
మంచును తొలిగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొంతమంది రాత్రంతా
వాహనాల్లోనే ఉండిపోయారు.
కాలిఫోర్నియా నుంచి నెవెడా వెళ్లే 112 కిలోమీటర్ల అంతర్రాష్ట్ర రహదారిలో
కొన్ని భాగాలను మూసివేశారు. మిచిగాన్, కాలిఫోర్నియా, ఇల్లినోయ్,
న్యూయార్క్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో విద్యుత్తు అంతరాయాలతో ప్రజలు
ఇబ్బంది పడ్డారని పవర్ ఔటేజ్ వెబ్సైట్ పేర్కొంది. ప్రధానంగా మిచిగాన్
రాష్ట్రంలోని ఆగ్నేయ ప్రాంతంలో 8,20,000 మందికి పైగా వినియోగదారులకు
విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలిపింది. విద్యుత్తు తీగలపై ఐస్ గడ్డ
కట్టడంతో దాన్ని తొలగించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక్కడి అగ్నిమాపక
సిబ్బంది ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.