హిమాచల్‌ప్రదేశ్ గెలుపుతో ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్
సీడబ్ల్యూసీ కూర్పుపైనా నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడంపై దృష్టి
న్యూఢిల్లీ : ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసి పునరుజ్జీవం పొందడం
లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి
జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో మూడురోజులపాటు వీటిని
నిర్వహిస్తారు. వరస ఓటములతో కుదేలై హిమాచల్‌ప్రదేశ్ గెలుపుతో ఊపిరి
పీల్చుకున్న కాంగ్రెస్ ఈ ఏడాది జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో
అదే పంథా కొనసాగించాలన్న సంకల్పంతో ఉంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్తున్న
ఛత్తీస్‌గఢ్‌లో ప్లీనరీ నిర్వహించడం ద్వారా ఆ రాష్ట్రంతోపాటు, పక్కనున్న
మధ్యప్రదేశ్, తెలంగాణ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి సమాయత్తమవుతోంది. ఈ
ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ భరోసాతో 2024 సార్వత్రిక ఎన్నికలకు
వెళ్లాలన్న వ్యూహంతో ఉంది.
సీడబ్ల్యూసీ కూర్పుపైనా నిర్ణయం : భావసారూప్య పార్టీలతో జట్టుకట్టి 2024
ఎన్నికలను ఎదుర్కొనే మార్గసూచీపై ప్లీనరీలో మేధోమథనం సాగించనున్నారు.
కాంగ్రెస్ అగ్రనాయకులతోపాటు సుమారు 15వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే నాయకత్వానికి లాంఛనంగా ఆమోదం
తెలిపి, కొత్త వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎంపికకు తొలుత పచ్చజెండా
ఊపనున్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలా? లేదా? అనేది
తొలిరోజు సమావేశంలో నిర్ణయిస్తారు. ఎన్నికలు అవసరం లేదని సీనియర్లు, ఉండాలని
జూనియర్లు డిమాండ్ చేస్తున్నారు. చివరిసారిగా 1997లో సీడబ్ల్యూసీకి ఎన్నికలు
జరిగాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడంపై దృష్టి : ఈ ఏడాది 9 రాష్ట్రాలకు ఎన్నికలు
జరుగుతాయి. ఈ నేపథ్యంలో అధికారం ఉన్నచోట నిలబెట్టుకోవడం, లేనిచోట అధికారంలోకి
రావడం ఎలా అన్నదానిపై ఈ ప్లీనరీలో చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం
చేయనున్నారు. పశ్చిమం నుంచి తూర్పునకు రాహుల్‌గాంధీ మరోయాత్ర చేయడంపైనా
చర్చించి, వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలను
ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లడంపై వ్యూహానికి తుదిరూపునిస్తారు.
తృణమూల్ కాంగ్రెస్, భారాస, ఆప్‌లు జాతీయ పార్టీలుగా రూపు సంతరించుకొని
ఎన్నికలకు సమాయత్తమవుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మునుపెన్నడూలేని
సవాళ్లు ఎదురవుతున్నాయి.
తొలుత స్టీరింగ్ కమిటీ భేటీ : శుక్రవారం ఉదయం తొలుత పార్టీ స్టీరింగ్ కమిటీ
సమావేశమవుతుంది. సాయంత్రం ప్లీనరీ తీర్మానాల ముసాయిదాపై చర్చ చేపడతారు. 25, 26
తేదీల్లో వాటిపై ప్లీనరీలో చర్చిస్తారు. ఒక్కోరోజు మూడు తీర్మానాలపై చర్చించి
ఆమోదించనున్నారు. ఆదివారం సాయంత్రం బహిరంగ సభతో సమావేశాలు ముగుస్తాయి.