ఇస్లామాబాద్ : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ అప్పు కోసం ప్రపంచ
దేశాలన్నింటివైపు ఆశగా ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌కు ఎట్టకేలకు 70 కోట్ల
డాలర్ల రుణం దొరికింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికిది భారీ సాయమే.
చిత్రమేంటంటే సీపెక్ పేరుతో పాక్‌ను అప్పుల ఊబిలోకి నెట్టిన చైనాయే ఈ రుణం
అందించడానికి ముందుకు రావడం. ‘‘చైనా డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఈ వారం 70
కోట్ల డాలర్లు మన స్టేట్ బ్యాంకు ఖాతాలో పడనున్నాయి’’ అని పాక్ ఆర్థికమంత్రి
ఇషాక్ దర్ బుధవారం ట్వీట్ చేశారు. పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిధులు
అడుగంటిపోతున్నాయి. ఇప్పుడు ఆ దేశం దగ్గర మూడు వారాల దిగుమతులకు సరిపడా
డాలర్లు మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)సంస్థ ఇస్తానన్న 1.1
బిలియన్ డాలర్ల రుణంపై ఇంకా తుదినిర్ణయం వెలువడలేదు. ఐఎంఎఫ్ కరుణిస్తే..
మిగతా దేశాలు కూడా అప్పులివ్వడానికి ముందుకొస్తాయని పాకిస్థాన్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో చైనా రుణ ప్రకటన పాక్‌కు ఊరటే.