రెండు మ్యాచ్‌లు పోయాయ్! స్టార్ షట్లర్లు పి.వి. సింధు, హెచ్.ఎస్. ప్రణయ్
ఓటమి బాట పట్టడంతో భారత్ కథ ఇక ముగిసినట్లే అనుకున్నారు. ఈ స్థితిలో గొప్పగా
పోరాడింది భారత్. పురుషుల, మహిళల డబుల్స్‌లో గెలిచి చైనాకు షాక్ ఇచ్చేలా
కనిపించింది. కానీ మిక్స్డ్ డబుల్స్‌లో తడబడి కాంస్యంతో టోర్నీ నుంచి
నిష్క్రమించింది.
ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ఫలించలేదు.
డబుల్స్ జోడీ పోరాడినా మన బృందానిది ఓటమి పక్షమే. శనివారం హోరాహోరీగా సాగిన ఈ
పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. ఈ మ్యాచ్‌లో మొదట పురుషుల
సింగిల్స్‌లో ప్రణయ్ 13-21, 15-21తో లీ లాన్ చేతిలో ఓడడంతో భారత్‌కు ఎదురు
దెబ్బ తగిలింది. ఆ తర్వాత మరో షాక్. టాప్ షట్లర్ పి.వి.సింధు 9-21, 21-16,
18-21తో ప్రపంచ 101వ ర్యాంకర్ ఫాంగ్ గావో చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. తొలి
రెండు మ్యాచ్‌లు పోవడంతో ఇక కథ ముగిసినట్లే అనిపించింది.
పురుషుల డబుల్స్‌లో ధ్రువ్ కపిల-చిరాగ్ శెట్టి 21-19, 21-19తో హిజి
తింగ్-హో డాంగ్‌ను ఓడించి ఆశలు నిలిపింది. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడిలో బరిలో
దిగిన మహిళల జోడీ పుల్లెల గాయత్రి-ట్రెసా జాలీ అద్భుత ప్రదర్శన చేసింది.
లీషెంగ్-వీజిన్తో మూడు గేమ్‌ల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో
21-18, 13-21, 21-19తో విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జోడీ మెరుపు షాట్లకు
దీటుగా సమాధానం చెప్పిన భారత జంట ఏ దశలోనూ తగ్గలేదు. ముఖ్యంగా ఆఖరి గేమ్‌లో
పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. సుదీర్ఘ ర్యాలీలతో ఉత్కంఠభరితంగా
సాగిన ఈ పోరులో 19-19తో స్కోరు సమమైనప్పుడు వరుసగా రెండు పాయింట్లు గెలిచిన
భారత జంట సంచలన విజయాన్ని సాధించింది.భారత్ 2.. చైనా 2 మ్యాచ్‌లు నెగ్గడంతో
అందరి దృష్టి ఇషాన్ భట్నాగర్-తనీషా మిక్స్డ్ డబుల్స్పైనే నిలిచింది.
జియాంగ్-వీయ్యాతో మ్యాచ్‌లో పోరాడినా 17-21, 13-21తో ఇషాన్ జంటకు ఓటమి
తప్పలేదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జియాంగ్ ద్వయం భారత జంటకు అవకాశం
ఇవ్వకుండా ఆడి చైనాను ఫైనల్‌కు తీసుకెళ్లింది. మరో సెమీస్‌లో కొరియా 3-1తో
థాయ్‌లాండ్‌ను ఓడించింది.