దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నది. అంతర్జాతీయ
ద్రవ్యనిధితో బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చిస్తున్నది. అయితే, ఈ చర్చలు
సఫలమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఫారిన్ ఫైనాన్సింగ్ ఎస్టిమేషన్,
దేశీయ ఆర్థిక చర్యలను ఖరారు చేయడంలో విఫలమవడంతో చర్చలు తలకిందులయ్యాయి. అయితే,
బుధవారం రాత్రి వరకు ఆర్థిక విధానాలకు సంబంధించిన ముసాయిదా మెమోరాండం
అందలేదని, చివరి కార్యాచరణ ప్రణాళికపై అభ్యంతరాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని
సీనియర్ ప్రభుత్వం అధికారి తెలిపారు. ఐఎంఎఫ్‌కు శుక్రవారం వరకు మెమోరాండం
సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలో 2019లో పాక్
6 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ సహాయాన్ని పొందింది. గతేడాది దీన్ని ఏడు బిలియన్
అమెరికన్ డాలర్లకు పెంచారు. పేలమైన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐఎంఎఫ్
నుంచి పాక్ మొత్తాన్ని పొందలేకపోయింది. తాజాగా 1.18 బిలియన్ డాలర్ల కోసం
ఐఎంఎఫ్‌తో చర్చలు జరుపుతున్నది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అయిషా గౌస్ పాషా
మాట్లాడుతూ ఆర్థిక విధానాలను ఖరారు చేస్తున్నామని, అన్ని సమస్యలను
పరిష్కరించిన తర్వాత ఆర్థిక విధానాలకు సంబంధించిన ముసాయిదా మెమోరాండం
ఐఎంఎఫ్‌కు అందిస్తామన్నారు. ఐఎంఎఫ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ
శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంస్కరణపై విస్తృత ఏకాభిప్రాయం కుదిరిందని,
ఐఎంఎఫ్ మిషన్ హెడ్‌ను ఆర్థిక మంత్రి కలిసి బెయిల్ అవుట్ ప్యాకేజీపై
చర్చించినట్లు పాక్ ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఒప్పందంపై చర్చలకు
సంబంధించి గడువును పొడిగిస్తారా? లేదా? అని చెప్పేందుకు నిరాకరించారు.