పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించిన షేబాజ్ షరీఫ్
కశ్మీర్‌కు అన్ని రకాలుగా సాయం అందిస్తామన్న పాక్ పీఎం
తమ వద్ద అణ్వాయుధం ఉందంటూ హెచ్చరిక
కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో
పర్యటించిన పాకిస్థాన్ ప్రధాని షేబాజ్ షరీఫ్ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
చేశారు. భారతదేశం కనుక తమపై డేగకన్ను వేస్తే అణ్వాయుధాలు కలిగిన తాము భారత్‌ను
తమ పాదాల కింద నలిపేస్తామంటూ హెచ్చరించారు. అంతేకాదు, కశ్మీర్‌కు రాజకీయ,
దౌత్య, నైతిక సాయం ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్యానించి కుటిల బుద్ధిని
చాటుకున్నారు. అణచివేతకు గురైన కశ్మీరీ సోదరులు, సోదరీమణులకు ఈ రోజు
పాకిస్థాన్ మొత్తం అచంచలమైన సంఘీభావాన్ని, మద్దతును తెలియజేసేందుకు కలిసి
వస్తోందని ట్వీట్ చేశారు. భారత్ నుంచి విముక్తి పొందాలన్న కలను సాకారం
చేసుకునేందుకు ప్రజలు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని కొనియాడారు. వారు తమ
త్యాగాల ద్వారా స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారని, వారి కలలు త్వరలోనే
సాకారమవుతాయని చెప్పడం ద్వారా మరోమారు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి తమ
వక్రబుద్ధిని షేబాజ్ చాటుకున్నారు.