వరుస భూకంపాల ధాటికి ధాటికి తుర్కియే, సిరియా వణికిపోయాయి. ఈ రెండు దేశాల్లో
కలిపి 4,000 మందికి పైగా దుర్మరణం చెందారు. వేల మందికి గాయాలయ్యాయి. అనేక
భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇంకా శిథిలాల కిందే వందల మంది ఉన్నట్లు
అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
మరోవైపు, తుర్కియేకు భారత్ అండగా నిలిచింది. సహాయ సామగ్రి, సిబ్బందిని ఆ
దేశానికి పంపింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ తుర్కియే,
సిరియాల్లో ఘోర ప్రకృతి విలయం చోటుచేసుకుంది. ఆగ్నేయ తుర్కియే, ఉత్తర
సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్
స్కేలుపై దాని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి తుర్కియే, సిరియా
సరిహద్దుకు ఇరువైపులా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క తుర్కియేలోనే 3
వేలకు పైగా ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. సిరియాలోని అలెప్పో, హామా సహా పలు
నగరాల్లోనూ నివాసగృహాలు నేలమట్టమయ్యాయి. కొన్ని క్షణాల్లోనే శిథిలాల దిబ్బలుగా
మారిపోయాయి. మొత్తంగా ఈ విలయం రెండు దేశాల్లో కలిపి ఏకంగా 4,000 మందికిపైగా
ప్రాణాలను బలి తీసుకుంది. శిథిలాల కింద ఇప్పటికీ వందల మంది చిక్కుకొని
ఉన్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. తుర్కియేలోని
గాజియాన్‌తెప్ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18
కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత దాదాపు 50
శక్తిమంతమైన ప్రకంపనలు రెండు దేశాలనూ వణికించాయి. ఆ ప్రకంపనల్లో ఒకదాని తీవ్రత
భూకంప లేఖినిపై ఏకంగా 7.5గా నమోదైంది.