మాత్రం ‘చైనీస్ న్యూ ఇయర్’ పేరుతో 15 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు.
అందరికీ జనవరి 1న నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ, చైనాలో మాత్రం ఇవాళ
అంటే జనవరి 22న. సంప్రదాయ లూనిసోలార్ క్యాలెండర్ ప్రకారం వసంత రుతువు
లిచున్తో చైనాలో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. దీనినే ‘స్ప్రింగ్
ఫెస్టివల్’ అని కూడా అంటారు. చైనా క్యాలెండర్లో 24 సౌర కాలాలు ఉంటాయి. మనకు
60 తెలుగు సంవత్సరాల్లాగే అక్కడ 12 జంతువుల పేర్లతో సంవత్సరాలు వస్తూ.. పోతూ
ఉంటాయి. నెలవంక రాక ఆధారంగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో 15 రోజులపాటు
వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ రోజుల్లో జరిగే లాంతర్ ఫెస్టివల్‌కు అత్యంత
ప్రాధాన్యత ఇస్తారు. ఏడు రోజులు దేశం మొత్తం సెలవులు ప్రకటిస్తారు. ఎక్కడా
ఎటువంటి కార్యకలాపాలు జరగవు. చైనాలో మాత్రమే కాకుండా టిబెట్, కొరియా,
వియత్నాం, బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్,
సింగపూర్, థాయిలాండ్, భారత్ వంటి దేశాల్లోనూ వేడుకలు చేసుకొంటారు. ఆసియా
ఖండంలోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా, మారిషస్, న్యూజిలాండ్, పెరూ,
దక్షిణాఫ్రికా, యూకే, యూఎస్ సహా పలు ఐరోపా దేశాల్లో చైనీస్ న్యూ ఇయర్
వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తారు.
‘నియాన్’ దరి చేరకూడదని : చైనా పురాణాల ప్రకారం.. నియాన్ అనే ఒక విచిత్ర
జంతువు కారణంగా ఈ పండగ ప్రారంభమైనట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఆ జంతువు
సముద్రం అడుగున లేదా పర్వతాల్లో ఉంటుందని నమ్ముతారు. పూర్వం నియాన్ రోజూ
వచ్చి గ్రామ ప్రజలను తినేదట. అర్ధరాత్రి వేళ పిల్లలను చంపేదట. ఒకసారి దాని
నుంచి తప్పించుకునేందుకు గ్రామస్థులంతా కలిసి మరో ప్రదేశానికి వెళ్లి
దాక్కోవాలనే నిర్ణయానికి వచ్చారు. అలా వారు గ్రామం విడిచి వెళ్తుంటే
యాన్‌హాంగ్ అనే ముసలాయన ఎదురై నియాన్‌పై ప్రతీకారం తీర్చకుంటానని చెప్పాడు. ఆ
రాత్రి వృద్ధుడు ఎర్రటి పేపర్లు తన ఇంట్లో కట్టి, బాణసంచా పేలుస్తూ ఉన్నాడు.
మరుసటి రోజు గ్రామస్థులు తిరిగి వచ్చి చూస్తే వృద్ధుడికి ఎటువంటి హానీ
జరగలేదు. దీంతో ఆ వృద్ధుణ్ని తమను కాపాడటానికి వచ్చిన దేవుడిగా భావించారు.
నాటి నుంచి ఎర్రటి రంగు, పెద్దపెద్ద శబ్దాలు నియాన్‌కు నచ్చవని
తెలుసుకున్నారు. ఆ రంగు దుస్తులు ధరించడం, లాంతర్లు వెలిగించడం, బాణసంచా
కాల్చడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ఒక సంప్రదాయంగా అలవాటు చేసుకున్నారు.
నియాన్‌ను టోయిస్ట్ మాంక్ హాంగ్జన్ లోజు బంధించాడని నమ్ముతుంటారు.
‘నియాన్’ అంటే సంవత్సరం అని కూడా అర్థం.
సందడంతా ఎరుపు రంగులోనే : చైనీయులు తమ పురాణాలను ఎక్కువగా విశ్వసిస్తారు.
ఆచారాలను పాటిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో దేవతలను, పూర్వీకులను
ఆరాధిస్తారు. ఏడాది ప్రారంభానికి ముందే తమ ఇంటిని తప్పకుండా శుభ్రం
చేసుకుంటారు. అలా చేయడం వల్ల దురదృష్టం బయటకు వెళ్లి.. తమ ఇంటికి అదృష్టం
వస్తుందని నమ్ముతారు. తలుపులు, కిటికీలను ఎర్రటి కాగితాలతో అలంకరిస్తారు.
కొన్ని సంప్రదాయ కవితలు రాసిన పేపర్లను కూడా గుమ్మాలకు వేలాడదీస్తారు. అవి
అదృష్టం కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని, సంపద కలగాలని, ఆయుష్షు పొందాలని ఇలా
రకరకాలుగా ఉంటాయి. ఎర్రటి ఎన్వలప్ కవర్లలో నగదు ఉంచి తమకు ఇష్టమైన వారికి
బహుమతిగా ఇస్తారు. ఎర్రటి దుస్తులు ధరిస్తారు. బాణసంచా కాలుస్తారు. కొత్త
ఏడాది పండగ సందర్భంగా రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులకు,
అతిథులకు వాటిని వడ్డిస్తారు. ఆ వంటకాల్లో డంప్లింగ్స్, టాంగ్యూన్
తప్పనిసరిగా ఉంటాయి. ఇక డ్రాగన్ అండ్ లయన్ డ్యాన్స్ న్యూ ఇయర్ వేడుకల్లో
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ వేషధారణలో నృత్యాలు చేస్తే దుష్టశక్తులు తమ
దరిచేరవని నమ్ముతారు.
భారత్‌లోనూ చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు : ఇక మనదేశంలో పశ్చమబెంగాల్ రాజధాని
కోల్‌కతాలోని టైరెట్టా బజార్లో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా
నిర్వహిస్తారు. ఈ ప్రాంతాన్ని ఓల్డ్ చైనా మార్కెట్‌గా కూడా పిలుస్తారు. ఇక్కడ
ఒకప్పుడు 20వేల మంది చైనా-భారత సంతతి ప్రజలు నివసిస్తుండేవారు. ప్రస్తుతం వారి
సంఖ్య 2వేలు మాత్రమే ఉన్నట్లు అంచనా. ఇక్కడ చేసే లయన్, డ్రాగన్ నృత్యాలు
బాగా ఆకట్టుకుంటాయి.