పన్నెండు రోజుల్లో రెండో ఘటన
పనాజీ : మాస్కో – గోవా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం
రేపుతోంది. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన ఈ విమానాన్ని అత్యవసరంగా
ఉజ్బెకిస్థాన్‌కు దారి మళ్లించినట్లు గోవా పోలీసులు తెలిపారు. 240 మంది
ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో మాస్కోలో బయల్దేరిన అజుర్ ఎయిర్ విమానం
షెడ్యూలు ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు దక్షిణ గోవాలోని
డబోలిమ్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ఈ విమానం భారత గగనతలంలోకి రాకముందే
విమానంలో బాంబు ఉన్నట్లు డబోలిమ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు గుర్తుతెలియని
వ్యక్తి నుంచి ఈ-మెయిల్ వచ్చింది. దీంతో గోవా విమానాశ్రయ సిబ్బంది, అధికారులు
అప్రమత్తం కావడంతో రష్యా విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. విమానాన్ని
క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నామని, అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు హోటళ్లలో
వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు రష్యన్ ఎంబసీ తెలిపింది.
పది రోజుల క్రితం.. గుజరాత్‌కు మళ్లింపు : జనవరి 9న మాస్కో నుంచి గోవాకు
బయలుదేరిన ఇదే అజుర్ ఎయిర్ విమానానికి తొలి బాంబు బెదిరింపు రావడం
తెలిసిందే. రష్యాలోని అజుర్ ఎయిర్ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్
వచ్చింది. దీంతో గోవాలో దిగాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్
ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేసి తనిఖీలు చేపట్టారు. అది ఉత్తుత్తి
బెదిరింపేనని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెర్మ్ విమానాశ్రయం
(రష్యా) నుంచి గోవా మార్గంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ బెదిరింపు
ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.