ఆహ్లాదం.. ఆహారం.. ఆరోగ్యం
సీఎం రేవంత్‌రెడ్డికి ఇష్టాలెన్నో
ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయనకు వంట చేయడం ఎంతో ఇష్టం. ఆటలు, చిత్రాలు గీయడం వంటి హాబీలు ఉన్నాయి. కొంతకాలం ఓ పత్రికలో జర్నలిస్టుగా పని చేశారు. రేవంత్‌రెడ్డి గురించి తెలుసుకుందాం.
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక, వనపర్తిలో కళాశాల స్థాయి విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడి స్థిరాస్తి, ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడే సొంతిల్లు నిర్మించుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కల్వకుర్తిలో ఇల్లు నిర్మించుకున్నారు. ఏటా దసరా పండగ తర్వాతి రోజు కొడంగల్‌కు వచ్చి ప్రజలతో మాట్ల్లాడటం ఆనవాయితీ. కరోనా లాక్డౌన్ సమయంలో కొడంగల్‌లోనే ఉన్నారు. కుటుంబీకు లకు ఆయనే స్వయంగా వండిపెట్టారు.
పచ్చదనానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. కొడంగల్‌లోని ఇంటి ప్రాంగణంలో పచ్చికతో కూడిన గార్డెన్ ఏర్పాటు చేశారు. చుట్టూరా ఎత్తయిన ప్రహరీ నిర్మించి రకరకాల చెట్లు, పూల మొక్కలు పెంచారు. పిత సెలోబియం అర్బోరియం (కోజబా అర్బోరియా) మొక్కను స్వయంగా నాటి దాని చుట్టూ గద్దె కట్టించారు. అక్కడే కార్యకర్తలతో సమావేశమవుతారు. 300 మంది వరకు కూర్చునే వీలుంది.
సీఎం సోదరుడు, కొడంగల్ నియోజకవర్గ బాధ్యుడు తిరుపతిరెడ్డికి శునకాలు అంటే ఇష్టం. కొడంగల్ నివాసంలో, హైదరాబాద్‌లోని నివాసంలో వాటిని పెంచుతున్నారు. వాటిలో బెల్జియం మిల్నైస్ జాతికి చెందిన శునకం ప్రస్తుతం కొడంగల్‌లో ఉంది.
తెల్లవారుజాము నుంచే : నిత్యం ఉదయం 4 గంటలకు లేవడం ఆయనకున్న అలవాటు. గోరువెచ్చని నీటిని తీసుకుంటారు. ఆ తర్వాత 30 ని.లు వ్యాయామం చేయడం దినచర్య. యాపిల్ లేదా పుచ్చకాయ జ్యూస్ తప్పనిసరిగా తీసుకుంటారు. దినపత్రిక చదివి కాసేపటికి టీ తాగుతారు. ఆ తర్వాత ముఖ్యమైన వారికి ఫోన్లు చేస్తారు. ఇంటికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతారు. స్నానం చేసి చపాతి లేదా జొన్నరొట్టె తీసుకుంటారు. నాటుకోడి కూర ఎంతో ఇష్టం. మటన్ బిర్యానీ ఇష్టంగా భుజిస్తారు. మధ్యాహ్నం ఆలస్యమైతే డ్రైప్రూట్స్ కాజు, బాదం, పిస్త, ఖర్జూరం వంటివి తీసుకుంటారు. ముద్ద పప్పు, సాంబారు పెరుగన్నం రోజూ ఉండాల్సిందే.
ఆటలంటే : రేవంత్‌రెడ్డికి క్రీడలంటే అమితాసక్తి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సమయాల్లో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు కొడంగల్‌లో నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు తన నివాసంలోనే అన్ని వసతులు కల్పించారు. తన మిత్రుడు వనపర్తికి చెందిన ఉపాధ్యాయుడు సురేందర్‌రెడ్డి పోటీలను పర్యవేక్షించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీలు అట్టహాసంగా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.