ఖమ్మం : మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలకు సొంత జిల్లాలో ఘనస్వాగతం లభించింది. గజమాలతో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఆహ్వానించారు. ముగ్గురు మంత్రులు అమరవీరులకు నివాలులు అర్పించారు. అనంతరం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుని ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముగ్గురూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని 10కి 9 స్థానాల్లో (ఒకటి సీపీఐ) గెలిపించిన ప్రజలకు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి, తాను కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను మొదటి 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాము ప్రకటించిన 6 గ్యారెంటీలకు వారెంటీ లేదని నాటి ప్రభుత్వం హేళన చేసిందని, గత ప్రభుత్వానికి ప్రజలు చెంప పెట్టుమనిపించారని అన్నారు. మహాలక్ష్మి పథకాన్ని రేవంత్ రెడ్డి, తాను కలిసి శనివారం మధ్యాహ్నం ప్రారంభించామని ప్రస్తావించారు. ఖమ్మం నగరంలో బస్‌లను ప్రారంభించామన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రధాన అవసరమైన ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుచి రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. తాము ప్రకటించిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని, మిగతా గ్యారెంటీలను 100 రోజులు కాకముందే అమలు చేస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలదని, దీనిని ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని ప్రోత్సహిస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో అందరికి ఇళ్లు, ఆరోగ్యశ్రీ, పింఛన్లు లాంటివి అందిరికీ లభిస్తాయన్నారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తీసుకొచ్చి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ తరపున జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు.
కబ్జాలు లేని ఖమ్మంను అందిస్తా : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
‘‘ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. భావోద్వేగంతో ఉన్న ప్రజలను అర్థం చేసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగానే ఉన్నప్పటికీ ప్రజల కష్టాలు తీరుస్తాం. ముస్లిం, వక్ఫ్ ఆస్తులను, రైతాంగం భూమి వాళ్లకి ఇచ్చేలా రెవెన్యూ మంత్రి పనిచేస్తారు. సీతారామ ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు తెస్తాను. పది లక్షల ఎకరాలు సాగవుతాయి. నా జీవిత లక్ష్యం, నా కోరిక గోదావరి జలాలు ఖమ్మం జిల్లా రైతాంగానికి అందించటం. ఎన్నికల సమయంలో స్వేచ్ఛ, కబ్జాలు లేని ఖమ్మంను ఇస్తానని హామీ ఇచ్చా. కబ్జాలు లేని ఖమ్మం కావాలని మీరు కోరారు. మీ కోరికను నెరవేరుస్తా. ప్రశాంతమైన ఖమ్మం, కబ్జాలు లేని ఖమ్మం, నిర్బంధాలు లేని ఖమ్మం మీకు అందిస్తా’’ అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
6 గ్యారెంటీలలో రెండింటిని అమలు చేశాం :పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇందిరమ్మ రాజ్యం కావాలని కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను అమలు చేశాం. 6 గ్యారెంటీలతోనే సరిపెట్టుకోకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. హామీలు అమలు చేయాలని ఒక మాజీ మంత్రి అంటున్నారు. రాగానే హామీలు అమలు చేయమని అడగడానికి కనీసం ఉండాలి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది. తెలంగాణ ప్రజలకు 100 రోజుల్లో పథకాలను అమలు చేసి తీరుతాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 9 ఏళ్లు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు మీరు. గురివింద గింజకు ఉన్న నలుపు కంటే ఎక్కువ నలుపు మీ కింద పెట్టుకుని కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర సొమ్మును అక్రమంగా కొల్లకొట్టిన పందికొక్కుల దగ్గర నుంచి కక్కిస్తామని బీఆర్ఎస్పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి జిల్లాకు విచ్చేసిన ఈ ముగ్గురు నేతలకు ఘనస్వాగతం లభించింది. గజమాలతో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఆహ్వానించారు. ముగ్గురు మంత్రులు అమరవీరులకు నివాలులు అర్పించారు. అనంతరం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సుని ప్రారంభించారు.