విజయవాడ : అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం ( ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ) జాతీయ విపత్తు నిర్వహణ(ఎన్ ఐ డి ఎం)ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ ,ఐఏఎస్ న్యూఢిల్లీ నేతృత్వంలో బృంద సభ్యులు మహేంద్ర చెందేలియా, ఏడి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాకేష్ కుమార్, ఎస్.ఈ, కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ లతో కలిసి బుధవారం కృష్ణాజిల్లా కంకిపాడు రైతు భరోసా కేంద్రం- 2 లో జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు గావించిన ఛాయాచిత్ర ప్రదర్శన కేంద్ర బృందం పరిశీలించింది. మిచాంగ్ తుఫానుకు జిల్లాలో జరిగిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టం, దెబ్బతిన్న రహదారులు, విద్యుత్తు లైన్లు తదితర రంగాలకు జరిగిన నష్టాలపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ కేంద్ర బృందానికి వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు 1,01,862 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, 913.62 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించారు. ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 312.23 కి.మీ. మేరకు 57 రహదారులు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 17.16 కి.మీ. మేరకు 6 రహదారులు దెబ్బతిన్నాయని జేసి కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం కేంద్ర బృందం పామర్రు గుడివాడ ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు, పామర్రు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, కైలే అనిల్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రాఘవరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి ఉయ్యూరు ఆర్డిఓ, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై ఇంచార్జ్ డి రాజు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి భాస్కరరావు, జిల్లా ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాసరావు, ఎస్ ఈ పంచాయతీరాజ్ విజయ కుమారి, స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.