విజయవాడ : దేశంలోనే అత్యంత ఘనంగా కృష్ణానది తీరాన కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయని, ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరపానందేంద్ర సరస్వతి అన్నారు. తొలి రోజైన ఆదివారం స్వామీజీ జగన్మాతను దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె.ఎస్. రామరావు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్లారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి శేష వస్త్రాన్ని, ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియా పాయింట్ వద్ద స్వామీజీ మాట్లాడారు. కనకదుర్గ అమ్మవారి క్షేత్రం దేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వర్ధిల్లుతోందని, సామాన్యుల పాలిట మహాక్షేత్రంగా భాసిల్లుతోందని పేర్కొన్నారు. అమ్మవారి క్షేత్రంలో ఎంతో ఆరాధనతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయని, కులం, మతం, జాతి భేదం లేకుండా ప్రతి వర్గానికి అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతోందని సామాన్య జనానికి ఆశీర్వచనం లభిస్తోందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి సంబంధించి అందరూ సమానమేనన్న భావనతో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతోందన్నారు.