విశాఖపట్నం : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుని మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హెలీప్యాడ్ వద్ద జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లు ప్రారంభిస్తారు, అక్కడినుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్ ప్రెవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవం, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి అచ్యుతాపురం ఏపీసెజ్‌కు చేరుకుని లారస్ ల్యాబ్స్ యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్ ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో ఒక కొత్త డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్ భవిష్యత్‌లో మరింతగా విస్తరించనున్నారు. ఇది సాప్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, అధునాతన కెఫ్టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
యూజియా స్టెరిల్స్ ప్రెవేట్ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ : ఫార్మా, బయెటెక్ ఉత్పత్తులకు సంబంధించి రూ. 300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రేవేట్ లిమిటెడ్ : యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిర్మించిన ఈ యూనిట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది.
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ : అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్ ల్యాబ్స్ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్‌ను సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు కూడా భూమి పూజ నిర్వహించనున్నారు.