హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
ఏపీ హైకోర్టులో జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు పుల్ కోర్టు ఆధ్వర్యంలో
ఘనంగా వీడ్కోలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత
న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు
న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు సోమవారం నేలపాడులో గల రాష్ట్ర
హైకోర్టులోని ప్రధమ కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు
పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ 1961 సెప్టెంబరు 26 న పుట్టిన
జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు లాయర్ల కుటుంబంలో జన్మించిన నాలుగో తరం
లాయరు అన్నారు. వీరి తండ్రి అయిన లేటు డి.వి.సుబ్బారావు విశాఖపట్నంలో మంచి
పేరు ప్రఖ్యాతలు ఉన్న 3 వ తరం లాయరు అని కొనియాడారు. వీరి కుమారుడు కూడా
ఇప్పటికే 5 వ తరం లాయరుగా వృత్తిని కొనసాగిస్తున్నారన్నారు. జస్టిస్
డి.వి.ఎస్.ఎస్.సోమయాజు ప్రాథమిక విద్య నుండి లా డిగ్రీ వరకూ విశాఖపట్నంలో తమ
విద్యను కొనసాగించారని, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీని పొందారన్నారు.
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో జూనియర్ న్యాయవాదిగా తమ పేరును నమోదు
చేసుకొని, తమ ప్రాక్టీసును విశాఖపట్నంలోనే కొనసాగించారన్నారు. సివిల్,
కమర్షియల్, ఆర్బిట్రేషన్ అంశాల్లో వీరు స్పైషలైజేషన్ చేశారన్నారు. కేవలం భారత
దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆర్బిట్రేషన్ కేసులకు వీరు హాజరై విజయం
సాధించారన్నారు. ఆంధ్రాక్రికెట్ ఆసోషియేషన్ కు అద్యక్షునిగా, క్రికెట్
కంట్రోల్ బోర్డు సభ్యులుగా, విశాఖపట్నం బార్ అసోషియేష్ కు, వాల్తేరు క్లబ్ కు
అధ్యక్షులుగా వీరు పలు హోదాల్లో పనిచేశారని ప్రశంసించారు. వీరు చిన్న నాటి
నుండి క్రికెట్ ను హాబీగా అలవర్చుకున్నారని, మంచి క్రికెటర్ గా పలు
టోర్నమెంట్స్ లో పాల్గొని విజయం సాధించారన్నారు.
న్యాయవాద వృత్తికి సంబంధించి వీరు మంచి అవగాహనతో పనిచేసి ఎంతో మంది మన్ననలను
పొందారన్నారు. కోర్టులో వీరు ఏ కేసును వాదించినా దానిలో విజయం సాధించి తమ
సామర్థ్యాన్ని నిరూపించుకునే వారన్నారు. 2017 సెప్టెంబరు మాసంలో హైదరాబాద్
హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలకు జడ్డిగా నియమితులైనారన్నారు.
గత రెండు మాసాలుగా వీరి సహచర్యంతో పనిచేసే అవకాశం నాకు కలిగిందని, వీరి
నుండి వృత్తి, పరిపాలనా పరమైన సలహాలు, సూచనలు పొందడం జరిగిందన్నారు. వీరు
ఎంతో మర్యాధ పూర్వకంగా ప్రవర్తించడమే కాకుండా త్వరితగతిన గ్రహించే శక్తి,
తెలివితేటలు వీరిలో ఎంతో మెండుగా ఉన్నాయని అభినందించారు. న్యాయ వ్యవస్థ
అభివృద్దికి వీరు ఎంతగానో కృషిచేశారని, వీరి సూచనలు, సలహాలు ఔత్సాహిక
న్యాయవాదులకు ఎంతో అవసరం అని ప్రసంశించారు. మంచి తెలివితేటలు, ఎంతో సామర్థ్యం
ఉన్న వీరి రిటైర్ మెంట్ న్యాయ వ్యవస్థకు తీరని లోటన్నారు. వీరి శేష జీవితం
ఎంతో ఆరోగ్యం, ఆనంధంగా సాగాలని, భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు
సాధించాలని ఆక్షాంక్షిస్తూ వారు తమ ప్రసంగాన్ని ముగించారు.
న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న జస్టిస్
డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు మాట్లాడుతూ ఏ.పి. హైకోర్టు లెజండరీ జడ్జిల్లో ఒకరైన
జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలో 21 సెప్టెంబరు 1997 న ఈ వృత్తిలో తమ
అదృష్టం ప్రారంభమైందన్నారు. వారి సహకారంతోనే ఈ గౌరవ ప్రధమైన వృత్తిలో
ప్రవేశించడం జరిగిందన్నారు. తదుపరి జస్టిస్ సురేష్, జస్టిస్ సి.వి.నాగార్జున
రెడ్డి కూడా ఈ వృత్తిలో ఎంతగానో ముందుకు వెళ్లేందుకు సహకరించారన్నారు.
వీరిద్దరికి ఎంతగానో నేను రుణపడిఉన్నాననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కంబైన్డు హైకోర్టులో తొలి ఛీప్ జస్టిస్ ప్రవీన్ కుమార్ ఇచ్చిన సందేశం కూడా
ఎంతో ప్రోత్సాహాన్ని కల్పించిదన్నారు. వృత్తి పరంగా మంచి సహకారాన్ని జస్టిస్
శేషసాయి, జస్టిస్ రఘు నందనరావు అందించారని అభినందించారు. అదే విధంగా గతంలో
ఛీప్ జస్టిస్ గా పనిచేసిన ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు ప్రస్తుత చీఫ్
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా వృత్తి పరంగా తమకు ఎంతగానో సహకరించారని
కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తనతో పనిచేసి ఎంతగానో సహరించిన వారందరికీ పేరు
పేరున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, ఆంధ్రప్రదేశ్
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి , ఎపి హైకోర్టు బార్
కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరనాధ్ తదితరులు
మాట్లాడుతూ జస్టిస్ డి.వి.ఎస్.ఎస్. సోమయాజులతో తమకు ఉన్న అనుభవాలను ఈ
సందర్బంగా వారు గుర్తుచేసుకుంటూ ఎంతో ప్రతిభ ఉన్న న్యాయమూర్తి తమకు దూరం
అవుతున్నారనే బాధను వ్యక్తం చేశారు. అదే విధంగా వారి శేష జీవితం
ఆయురారోగ్యాలతో ఆనంధంగా కొనసాగాలని వారంతా ఆకాంక్షించారు. ఈవీడ్కోలు
కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్
నాగిరెడ్డి, రిజిష్ట్రార్లు,రిజిష్ట్రార్ జనరల్,సీనియర్ న్యాయవాదులు,బార్
అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.