ఇచ్చిన మాట ప్రకారం వై.ఎస్.ఆర్.ఆసరా అమలు
చీపురుపల్లిలో 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన
చీపురుపల్లి వై.ఎస్.ఆర్. సంబరాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం(చీపురుపల్లి) : రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు, వారి ఆరోగ్య సంరక్షణ, వారి పిల్లల విద్యకోసమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మహిళలకు తమ కుటుంబాల్లో గౌరవం పెంచేందుకే ప్రతి పథకాన్ని మహిళల పేరుతో అందించేలా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ వై.ఎస్.ఆర్.ఆసరా కార్యక్రమం ద్వారా స్వయంశక్తి మహిళలకు రుణమాఫీ కోసం నిధులు నాలుగు విడతల్లో విడుదల చేయడం జరిగిందన్నారు. చీపురుపల్లి మండల స్థాయిలో వై.ఎస్.ఆర్.ఆసరా నాలుగో విడత సంబరాల కార్యక్రమం స్థానిక కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయ మైదానంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ తొలుత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ ఎటువంటి అవినీతికి, రాజకీయ పక్షపాతానికి తావులేకుండా అందిస్తున్నామని పేర్కొన్నారు. చీపురుపల్లిలో త్వరలోనే వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నామని, ఈ ఆసుపత్రి ఏర్పాటుతో యీ ప్రాంత వాసులు ప్రతి వైద్య అవసరం కోసం విజయనగరం వెళ్లాల్సిన అవసరం వుండదన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు, వారిలో మనోధైర్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు, గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాలు చేస్తోందన్నారు. వారి భద్రతకోసం దిశ వంటి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. మహిళలు వ్యాపారాలు నిర్వహించుకొని ఆదాయం సంపాదించేలా చేయూత వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం సహాయ పడుతోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ మహిళలకు సక్రమంగా చేరేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషిచేస్తోందన్నారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాలుగా అమలు చేస్తామని చెప్పిన హామీలన్నీ అమలు చేశామని, మహిళలు స్వశక్తితో ఆర్ధికంగా స్వయంశక్తి మంతులుగా నిలిచేలా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు. ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకే అందించడం ద్వారా ఎలాంటి అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదొక్కటేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చీపురుపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని, వంద పడకల ఆసుపత్రి కూడా ఏర్పాలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చీపురుపల్లి మండలంలోని 14,727 మంది స్వయంశక్తి సంఘాల మహిళలకు రూ.11.54 కోట్ల వై.ఎస్.ఆర్.ఆసరా మొత్తాలకు సంబంధించిన చెక్కును మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులు, ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయగా మంత్రి, జిల్లా కలెక్టర్, జెడ్పీ ఛైర్మన్, ఎంపి తదితరులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.సి. రఘురాజు, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఆర్.డి.ఓ. బి.శాంతి, జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఎంపిపి ఇప్పిలి వెంకటనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
విలేజ్ హెల్త్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
చీపురుపల్లిలో రూ.20.80 లక్షలతో నూతనంగా నిర్మించిన వై.ఎస్.ఆర్. విలేజ్ హెల్త్ క్లినిక్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతుభరోసా కేంద్ర భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీకి చెందిన 41 మంది ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలను కూడా మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. బి.శాంతి, తహశీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.