800 మెగావాట్ల 8వ యూనిట్ వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం
సీఓడీపై ఏపీజెన్కో, ఏపీ డిస్కంలు, ఏపీ ట్రాన్స్కో, ఏపీపీసీసీ ప్రతినిధుల
సంతకాలు
8789 మెగావాట్లకు పెరిగిన ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం
రాష్ట్ర గ్రిడ్ డిమాండులో 55–60 శాతం విద్యుత్ అందించే స్థాయికి పెరిగిన ఏపీ
జెన్కో సామర్థ్యం
విజయవాడ : ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్
లోని ఎనిమిదో యూనిట్ విజయవంతంగా వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.
కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల సామర్థ్యంగల ఎనిమిదో యూనిట్ 72 గంటలపాటు
నిర్విరామంగా వంద శాతంపైగా సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో బుధవారం
వాణిజ్య ఉత్పత్తికి శుభం కార్డు పడింది. ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్,
ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు
సమక్షంలో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య
ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీపీసీసీ, ఏపీ డిస్కంల ప్రతినిధులు బుధవారం
ఉదయం సీఓడీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన
సంస్థ (ఏపీజెన్కో) సరికొత్త మైలురాయిని అధిగమించినట్లయింది. 1760 నుంచి 2560
మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని ఏపీజెన్కోలో డాక్టర్
ఎన్టీటీపీఎస్ అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. డాక్టర్
ఎన్టీటీపీఎస్లో స్టేజ్ –5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్
క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఎనిమిదో యూనిట్ కోవిడ్ లాంటి
కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి వాణిజ్య ఉత్పత్తికి శ్రీకారం చుట్టడం
పట్ల ఏపీ జెన్కోతోపాటు పవర్ యుటిలిటీస్ అధికారులు, సిబ్బంది,
హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
డాక్టర్ ఎన్టీటీపీఎస్లో నూతనంగా రూపుదిద్దుకున్న 800 మెగావాట్ల యూనిట్
బుధవారం సంపూర్ణ సామర్థ్యంతో నిర్విరామంగా 72 గంటలు విద్యుత్ ఉత్పత్తి
పూర్తి చేసింది. ఈ ప్లాంటు సామర్థ్యం 800 మెగావాట్లుకాగా 72 గంటలపాటు సగటున
820 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. సీఓడీ కోసం మూడురోజులపాటు అత్యంత
ఉత్కంఠతో ఎంతో ఉద్విగ్నంగా ప్లాంటును నడిపిన అధికారులు, సిబ్బంది 72వ గంట
ముగియగానే ఆనందోత్సాహాలతో ఒక్కసారిగా చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
సంస్థ ఎండీ చక్రధర్ బాబు స్వయంగా అందరి దగ్గరకు వెళ్లి శుభాభినందనలు
తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులు, ఉద్యోగులు పరస్పరం శుభాకాంక్షలు,
అభినందనలతో ఆనందం పంచుకున్నారు. అనంతరం సంస్థ ఎండీ కేక్ కట్ చేశారు. కొత్త
యూనిట్ నిర్మాణంలో భాగస్వాములై సేవలందించిన పలువురిని ఈ సందర్భంగా ఎండీ
జ్ఞాపికలతో సత్కరించారు.
ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో సాకారం : ఎండీ చక్రధర్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడంవల్లే అనేక
సవాళ్లను అధిగమించి డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఎనిమిదో యూనిట్ నిర్మాణ పనులు
పూర్తి చేసి సీఓడీ చేసుకోగలిగామని ఏపీజెన్కో ఎండీ చక్రధర్ బాబు అన్నారు.
సీఓడీ సందర్భంగా పవర్ యుటిలిటీస్ అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి ఎండీ
ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ఇంధన, అటవీ పర్యావరణ,
భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని విధాలా సహాయ
సహకారాలు అందించంతోపాటు మార్గదర్శకం చేసి ప్రోత్సహించడంవల్లే ఇది సాధ్యమైంది.
ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్
అడుగడుగునా అందించిన మార్గదర్శకం, ప్రభుత్వ సహకారంవల్లే అన్ని పనులు పూర్తి
చేసి ఎనిమిదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించగలిగాం. ఏపీఈఆర్సీ ఛైర్మన్
జస్టిస్ నాగార్జున రెడ్డి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు.
మహాక్రతువులో భాగస్వాములైన ఏపీజెన్కో ఉద్యోగులు, భాగస్వామ్య సంస్థలైన
బీహెచ్ఈఎల్, బీజేఆర్, ఆర్ఈసీ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు
తెలియజేస్తున్నానని ఏపీజెన్కో ఎండీ చక్రధర్ బాబు వివరించారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో సవాళ్లు అధికం : ప్రయివేటు సంస్థలతో పోల్చితే ప్రభుత్వ
రంగ సంస్థల్లో అనేక సవాళ్లు ఉంటాయని, పవర్ యుటిలిటీస్ ప్రతినిధులు వాటిని
అధిగమించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చక్రధర్
బాబు వివరించారు. కొత్త యూనిట్ ప్రారంభంతో సంస్థ బాధ్యత మరింత
పెరిగిందన్నారు. రోజురోజుకూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న
నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యం పెంచుకుంటూ ముందుకు సాగాలని ఆయన ఉద్బోధించారు.
ఏపీ జెన్కో డైరెక్టర్లు బి. వెంకటేశులు రెడ్డి (ఫైనాన్స్),
డీఎస్జీఎస్ఎస్ బాబ్జీ (థర్మల్), సయ్యద్ రఫీ (హెచ్ఆర్ అండ్ ఐఆర్),
సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్ (కోల్), ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ ఏకేవీ
భాస్కర్, టాన్జడ్కో, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, ఏపీపీసీసీ
ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
8789 మెగావాట్లకు పెరగనున్న జెన్కో సామర్థ్యం : డాక్టర్ ఎన్టీటీపీఎస్లో
800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ సీఓడీతో ఏపీ జెన్కో విద్యుదుత్పాదన సామర్థ్యం
8789 మెగావాట్లకు పెరిగినట్లయింది. ప్రస్తుతం జెన్కో 5810 మెగావాట్ల థర్మల్,
1773.600 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పాదన
సామర్థ్యం కలిగి ఉంది. ఎన్టీటీపీఎస్లో బుధవారం నూతనంగా 800 మెగావాట్ల
థర్మల్ యూనిట్ సీఓడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6610
మెగావాట్లకు, మొత్తం ఉత్పాదన సామర్థ్యం 8789 మెగావాట్లకు పెరిగినట్లయింది.