శ్రీకాకుళం : ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజును
పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా
నిర్వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్
పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ శ్రేణులు పెద్ద
ఎత్తున కలసి స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, మహిళలు, కుల సంఘాల ప్రతినిధులను
భాగస్వాములను చేస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. సీఎం జగన్
జన్మదిన వేడుకల సందర్భంగా అన్ని గ్రామాల్లో విద్యార్థులకు ఆటల పోటీలు, మహిళలకు
ముగ్గులు, ఇతరత్రా పోటీలు నిర్వహించాలని అన్నారు. రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి
అవకాశమున్నచోట్ల పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని, అనాథ,
వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు
చేపట్టాలని, సర్వమత ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించారు.
పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలను పెద్ద
ఎత్తున భాగస్వాములను చేస్తూ సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి
ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలకు హాజరుకండి:
21వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే
కార్యక్రమం ఉందని, దీనికి జిల్లా పార్టీ కార్యవర్గం, అనుబంధ విభాగాల
ప్రతినిధులు తప్పక హాజరు కావాలని కృష్ణదాస్ కోరారు.