అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతిలో రహదారులు, పారిశుద్ధ్యం కోసం వినియోగించడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారంటూ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్ 111కు విరుద్ధం. ₹100 కోట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లించారు. గతంలో ఎప్పుడూ తితిదే నిధులు మళ్లించలేదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. దీంతో పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్యం పనులకు నిధులు మళ్లించొద్దు. కాంట్రాక్టర్లకు సొమ్ము విడుదల చేయొద్దు. టెండర్ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని టీటీడీకి హైకోర్టు స్పష్టం చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అనంతరం విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి ఏటా ఒక్క శాతం నిధులు ఖర్చు చేసేందుకు ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే.
[https://bloomtimes.org/images/srilekha_/highcourt.jpg]