నా తల్లిని, భార్యని వైసీపీ నేతలు అవమానించారు
జగన్ మహిళలను మోసం చేశాడు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అనకాపల్లి జిల్లా : తన తల్లిని, భార్యని వైసీపీ నేతలు అవమానించారని వాళ్లని కూడా అరెస్ట్ చేస్తానని బెదిరించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళవారం చిన్నదొడ్డిగల్లుకి యువగళం. పాదయాత్ర చేరుకుంది. ఇక్కడ మహిళలతో మహాశక్తి కార్యక్రమం గురించి మాట్లాడారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం తామర గ్రామానికి చెందిన పెద్దపల్లి లక్ష్మికి నారా లోకేష్ రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తన కుమారుడిని ఇసుక మాఫియా, చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా దివ్యాంగురాలు వెంకటలక్ష్మికి స్కూటీ అందిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మాయ హామీలు ఇచ్చి జగన్ మహిళలను మోసం చేశాడు. పాదయాత్రలో మహిళలు పడుతున్న కష్టాన్ని నేను చూశాను. మీ కన్నీళ్లు తీర్చే బాధ్యత నాది. టీడీపీ – జనసేన పార్టీలు కలిసి మహాశక్తిని ప్రకటించాం. జగన్‌ని తన సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. తల్లికి, చెల్లికి న్యాయం చెయని జగన్ రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తాడా’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు.
జగన్ మహిళలను మోసం చేశాడు : జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. బాధితుల తరపున పోరాడితే మాపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. మహిళలు లేనిది లోకం లేదు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలు. మహిళలు సంతోషంగా ఉంటే ఇళ్లు, రాష్ట్రం బాగుంటుంది. మహనేత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మాయ హామీలు ఇచ్చి జగన్ మహిళలను మోసం చేశాడు. మద్యపాన నిషేధం అన్న జగన్ ఇప్పుడు జే బ్రాండ్లు అమ్మి మహిళల పసుపు – కుంకుమ చెరిపేస్తున్నాడు. జగన్‌కి బల్ల పైన ఒక బటన్.. బల్ల కింద ఒక బటన్ ఉంటుంది. ఏపీలో విద్యుత్ చార్జీలు 9 సార్లు, ఆర్టీసీ చార్జీలు 3 సార్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ బాదుతున్నాడు.. టీడీపీ – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకొచ్చి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మొదలుకొని అన్ని పన్నులు తగ్గిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు.
20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మహిళలను గౌరవించడం, వారి విలువ తెలిసేలా చిన్న నాటి నుంచే పాఠ్యాంశాలు ప్రవేశపెడతాం. జగన్‌వి మాయ మాటలు. అసలు దిశ చట్టమే లేదు. వైసీపీ నాయకులే మహిళలను అవమానపరుస్తూ మాట్లాడితే ఇక బయట రక్షణ ఎలా ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రన్న బీమా 5 లక్షలతో ప్రారంభించి క్రమంగా రూ.10 లక్షలకు పెంచుతాం. డ్వాక్రా మహిళలను ఆదుకోకపోగా మీరు దాచుకున్న అభయహస్తం నిధులు 2200 కోట్లు జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. టీడీపీ – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తాం. పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తాం. జగన్ 2.30 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తాం .. మెగా డీఎస్సీ అని మోసం చేశాడు. జాతీయ విద్యా విధానం పేరుతో టీచర్ పోస్టులు తగ్గిస్తున్నాడు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. క్రమ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు