పల్నాడు : పల్నాడు జిల్లా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపి సిట్టింగులకు ఎసరు పెట్టుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుబులు మొదలైంది. పల్నాడు జిల్లాలో ఏకంగా మంత్రిగా కొనసాగుతున్న విడుదల రజిని గుంటూరు పశ్చిమ కు మారుస్తూ కొత్త అభ్యర్థి రాజేష్ నాయుడు ను తెరపైకి తెచ్చారు. దీంతో ఆ పార్టీలో కలకలం మొదలైంది. సీనియర్లను పక్కనపెట్టి అనూహ్యంగా రాజేష్ నాయుడు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ చైతన్యం ఉన్న చిలకలూరిపేట గుంటూరు నగరాలపై కుల సమీకరణలకు వైసీపీ పెద్దపీట వేయడం కలిసి వస్తుందా..? లేదా అన్నది వేచి చూడాలి. ఇప్పటికే అసమ్మతి ఎదుర్కొంటున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సీట్లపై కూడా ప్రత్యర్ధులు మార్పులు ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డినే పక్కన పెడితే పీకే సర్వేలలో వెనుకబడిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వేటు తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట సీటును ఆశిస్తుండగా శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా గజ్జల బ్రహ్మారెడ్డి అసమ్మతి కార్యక్రమాలకు తెరతీస్తున్నారు. గురజాల లో కూడా బిసి కార్డును ప్రయోగించి జంగాకు మరోసారి అవకాశం ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా వినుకొండలో నన్నపనేని సుధా, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ సంచలన నిర్ణయాలు పల్నాడుకు తాకుతుందని ఆ పార్టీలో పెద్ద చర్చగా మారింది.