గుంటూరు పీడీజే కోర్టు
ఖాతాదారులకు పారదర్శకమైన సేవలు అందిస్తున్న మార్గదర్శి చిట్ఫండ్ వైపు న్యాయం ఉందని మరోసారి రుజువైంది. మార్గదర్శికి చెందిన 1,050 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తు చెల్లదని గుంటూరు పీడీజే కోర్టు తీర్పు వెలువరించింది. జప్తు నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చెల్లుబాటుకావని ఏపీ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్లను కొట్టివేసింది. తద్వారా మార్గదర్శి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ప్రభుత్వ కుట్రకు బ్రేక్ పడింది.
మార్గదర్శి చిట్ఫండ్ ఆస్తులను జప్తుచేయడం ద్వారా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ సీఐడీ యత్నాలకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శికి చెందిన 1,050 కోట్ల రూపాయలు విలువైన చరాస్తుల మధ్యంతర జప్తును ఖరారు చేయాలన్న సీఐడీ విన్నపాన్ని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ అదనపు డీజీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. చందాదారులకు, ప్రైజ్డ్ సబ్స్క్రైబర్లకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైనట్లుగా సీఐడీ రుజువు చేయలేకపోయిందని కోర్టు తేల్చిచెప్పింది.
1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తు నిమిత్తం ఏపీ సర్కార్ ఈ ఏడాది మే 29న జారీచేసిన జీవో 104, జూన్ 15న జారీచేసిన జీవో 116, జులై 27న జారీచేసిన జీవో 134 చెల్లవంటూ తేల్చి చెప్పింది. జప్తును ఖరారు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్బీజీ పార్థసారథి సోమవారం కీలక తీర్పు వెలువరించారు.
మార్గదర్శి చిట్ ఫండ్ కీర్తిప్రతిష్ఠలు, చందాదారుల్లో సంస్థ విశ్వసనీయతను దెబ్బతీయాలనే లక్ష్యంతో మార్గదర్శికి చెందిన 1,050 కోట్ల రూపాయలు విలువచేసే చరాస్తుల మధ్యంతర జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం వేర్వేరు తేదీల్లో మూడు జీవోలు జారీచేసింది. జీవోల ద్వారా చేసిన మధ్యంతర జప్తును ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ అదనపు డీజీ కాంపిటెంట్ అథారిటీ హోదాలో గుంటూరు పీడీజే కోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వాటిపై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. సంస్థ ఆస్తులను జప్తు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పి.రాజారావు వాదించారు.
సొమ్ము చెల్లించలేదని ఏ ఒక్క చందాదారు ఫిర్యాదు చేయలేదన్నారు. చందాదారుల రక్షణ అనే ముసుగులో మార్గదర్శి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం, సీఐడీ తెరలేపిందన్నారు. సొమ్ము చెల్లించలేదనే చందాదారులు ఎవరు? వారి పేర్లు ఏమిటి? వారికి ఎంత సొమ్ము చెల్లించాలి? అనే వివరాలను సీఐడీ చెప్పలేకపోతోందన్నారు. వాటిని తమముందుంచాలని ఇదే కోర్టు ఆదేశించినా సీఐడీ ముఖం చాటేసిందని చెప్పారు. చిట్ఫండ్ నిబంధనలకు లోబడి మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోందన్నారు.
చిట్స్ నిర్వహణలో ఏమైనా లోటుపాట్లుంటే చిట్ఫండ్ చట్ట నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. అందుకు భిన్నంగా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని వినియోగించి ఆస్తులను జప్తు చేయాలని సీఐడీ అభ్యర్థిస్తోందన్నారు. సంస్థ సొమ్ము చెల్లించడంలో విఫలమైందనే ఆరోపణ లేనప్పటికీ ఆస్తులను జప్తు చేస్తే అంతిమంగా నష్టపోయేది చందాదారులేనని వివరించారు.
నాలుగు రాష్ట్రాల్లో మార్గదర్శి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలోనే ఆరోపణలు చేయడం వెనుక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. చందాదారులకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైందని నిరూపించే సాక్ష్యాధారాలను సీఐడీ కోర్టు ముందు ఉంచలేకపోయిందన్నారు. సరైన కారణాలు లేకుండా ప్రతీకారంతో జప్తు ఉత్తర్వులు జారీచేయడానికి వీల్లేదని తెలిపారు. జప్తుపై ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు ఉండవన్నారు.
ఆస్తుల జప్తును ఖరారు చేయాలని సీఐడీ చేసిన విన్నపాన్ని తోసిపుచ్చాలని కోరారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చందాదారుల ప్రయోజనాల రక్షణకే జప్తు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్నన్యాయమూర్తి చందాదారులకు సొమ్ము చెల్లించడంలో మార్గదర్శి విఫలమైందంటూ ఏపీ సీఐడీ నిరూపించలేకపోయిందన్నారు. ఈ కారణంగా మార్గదర్శి చరాస్తుల మధ్యంతర జప్తునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 104, 1116, 134 చెల్లవని తేల్చి చెప్పారు.