విజయనగరం : విజయనగర ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన మెగా మ్యూజికల్ నైట్ ఉర్రూతలూగించింది. స్థానిక అయోధ్యా మైదానంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఈ సంగీత, వినోద భరిత కార్యక్రమానికి యువత కేరింతలు కొట్టారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఆధ్వర్యంలో గాయకులు రాహుల్ సిప్లిగంజ్, జయంత్, సాయి చరణ్, గాయనీమణులు సునీత, లిప్సిక, మోహన భోగరాజు, సాహితి చాగంటి తదితరుల పాటలు హుషారెత్చించాయి. జబర్దస్త్ రాంప్రసాద్ బృందం స్కిట్స్ నవ్వించాయి. విజయవాడ సిద్ధార్థ కళాశాల విద్యార్థినులు డ్రమ్స్ డాన్స్, ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్ధినుల నృత్య కార్యక్రమాలు అలరించాయి. శ్యామల యాంకరింగ్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలను మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ ప్రముఖులు కుటుంబాలతో సహా హాజరై తిలకించారు.