విజయవాడ : లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా అని మండిపడ్డారు. ఎక్కడెక్కడో దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పిస్తున్నాడా అనే సందేహం కలుగుతోందన్నారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరసు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. 2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చ మీడియా అయినా దీనికి సమాధానం చెప్పాలన్నారు.