రాజమహేంద్రవరం : రాజ మహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్‌తో పాటు, చర్మ సంబంధిత అలర్జీతో బాధపడుతున్నారు. ఆయన చర్మంపై పలు చోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు బాగా బరువు తగ్గినట్టు ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుర్తించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బరువు తగ్గడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, డీహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చునని వైద్యులు సూచించినట్లు సమాచారం. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొదటి నుంచీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల వినతిని కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వైకాపా ప్రభుత్వం చంద్రబాబుకి జైల్లో వసతులు కల్పించకుండా శారీరకంగా ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుని కారాగార వైద్యులు గురువారం పరిశీలించారు. చర్మ వైద్యుల్ని సంప్రదించాలని నిర్ణయించారు. జైలు అధికారులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)కి లేఖ రాసి చర్మ వైద్య నిపుణులను పంపించాలని కోరారు. జీజీహెచ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారాగారానికి వెళ్లి చంద్రబాబును పరీక్షించారు. 6.30 గంటలకు వారు బయటకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా వారు మాట్లాడేందుకు నిరాకరించారు. చంద్రబాబు చేతిపైనా, ఛాతీ, గడ్డంపైనా దద్దుర్లు ఏర్పడినట్లు తెలిసింది. కారాగార ఇన్‌ఛార్జి పర్యవేక్షకుడు రాజ్‌కుమార్‌ని వివరణ కోరగా చంద్రబాబుకి చర్మ సంబంధిత అలర్జీ రావడంతో వైద్య నిపుణులకు చూపించామన్నారు. వైద్యులు సూచించిన మందులు అందజేస్తామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన అవసరం లేదని పేర్కొంటూ ఓ బులెటిన్ విడుదల చేశారు.