అమరావతి : రాష్ట్రంలోని పారిశుద్ధ్య, సఫాయి కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, వారి సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
శ్రీలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడంతో పాటు కార్మికుల ఆత్మగౌరవం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్య పనుల్లో ఇకపై యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు మాట్లాడుతూ తమను కనీసం ముట్టుకోవడానికి ఇష్టపడని సమాజంలోనూ సఫాయి కార్మికులు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు లేకుంటే పర్యావరణమే మురికికూపంగా మారుతుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ చిన్నరాముడు, సఫాయి కార్మిక ఆందోళన్ ప్రతినిధి విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
[https://bloomtimes.org/images/Hemalatha_/vishaka.jpg]