తిరుపతి : తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమత్తు, నిర్వహణ
చేపట్టేందుకు ఉద్దేశింపబడిన ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు కోసం గతంలో కేంద్ర
విమానయాన శాఖా మంత్రితో పలుమార్లు సంప్రదింపులు జరిపిన విషయం విదితమే. గతంలో
హైదరాబాద్ లో జరిగిన ఇన్వెస్ట్ ఇండియా శిఖరాగ్ర సమావేశం వేదికగా ఎమ్మార్వో
సెంటర్ ఏర్పాటు కోసం ఔత్సాహిక కంపెనీలను టెండర్లకు ఆహ్వానించడం జరిగింది.
ఇదిలా ఉండగా ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కెనెడా ఏవియేషన్
కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు తిరుపతి
విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాలను
పరిశీలించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్
క్లస్టర్ ని సందర్శించారు. తదుపరి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో తిరుపతి
లోని వారి కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మాట్లాడుతూ గౌరవ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పెద్ద నగరాలతో దీటుగా తిరుపతి నగరాన్ని
మరియు తిరుపతి జిల్లాని అభివృద్ధి పథంలో నడిపేందుకుగాను రూపొందించబడిన
ప్రణాళికలో భాగంగా తిరుపతి విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటు చేయడం కోసం
ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేసారు. ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు
కెనెడా ఏవియేషన్ కంపెనీ వారు వారి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి
పంపనున్నారని రానున్న 6 నెలల సమయంలో ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు అవుతుందని
ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఇంజనీరింగ్
విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఎంపీ గురుమూర్తి అన్నారు.