బ్రిటన్ : బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. సునాక్‌తో కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్ 2030ని అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా రిషి సునాక్ అభినందనలు తెలుపుతూ అసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రిషి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయనతో కలిసి ప్రపంచ సమస్యలపై సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్ 2030ని అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న భారతీయులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల చారిత్రక బంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మారుస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఐదు రోజుల పాటు చేసుకొనే దీపావళి వేడుకల వేళ రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా విజయం సాధించారు. గతంలో అధికార కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ప్రధాని పదవికి లిజ్ ట్రస్‌పై పోటీచేసి ఓటమిపాలైన కొద్ది వారాల్లోనే యూకేలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏకగ్రీవంగా ప్రధాని పదవికి ఎన్నికై బ్రిటన్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.