తిరువనంతపురం : ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు నియమించిన ఉప కులపతులకు హైకోర్టులో సోమవారం కాస్త ఊరట లభించింది. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తుది ఆదేశాలు జారీ చేసే వరకు వీరు పదవుల్లో కొనసాగవచ్చునని న్యాయస్థానం తెలిపింది. దీపావళి పండుగ అయినప్పటికీ ప్రత్యేకంగా ఈ అంశంపై విచారణ జరిపింది. పినరయి విజయన్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు (VCల)ను నియమించింది. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం ఈ వీసీలకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు సోమవారం సాయంత్రం విచారణ జరిపింది. గవర్నర్ జారీ చేసిన షోకాజ్ నోటీసు ప్రకారం ఆయన తుది ఆదేశాలు జారీ చేసే వరకు వీసీలు తమ పదవుల్లో కొనసాగవచ్చునని తెలిపింది.
గవర్నర్ మొదట ఈ తొమ్మిది మంది వీసీలకు ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో సోమవారం ఉదయం 11.30 గంటలకల్లా పదవుల నుంచి వైదొలగాలని ఆదేశించారు. అయితే వీరంతా హైకోర్టును ఆశ్రయించిన తర్వాత గవర్నర్ మరొక నోటీసును జారీ చేశారు. విశ్వవిద్యాలయాల ఉప కులపతులుగా కొనసాగేందుకుగల చట్టబద్ధమైన హక్కును వివరిస్తూ నవంబరు 3 సాయంత్రం ఐదు గంటల్లోగా సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు. సమాధానాలు ఇవ్వడంలో విఫలమైతే, ఈ నియామకాలు చెల్లనివిగా, చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరిస్తారని, వీసీలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. సక్రమంగా నియామకాలు జరిపేందుకు వీలుగా పదవులకు రాజీనామా చేయాలని ఈ వీసీలను కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ గవర్నర్ ఖాన్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో యుద్ధం ప్రకటించారన్నారు. సంఘ్ పరివార్ నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.