న్యూఢిల్లీ : ఢిల్లీ నగరం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. స్వీడ్జర్లాండ్కి చెందిన ‘ఐక్యూఎఐఆర్’ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఢిల్లీ తర్వాత పాకిస్థాన్లోని లాహోర్ నగరం ఈ జాబితాలో చేరింది. అధిక కాలుష్య నగరాలను కలిగి ఉన్న దేశంగా ఖతార్ మొదటి స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో నిలిచినట్లు ప్రపంచ ఎక్యూఐ వెబ్సైట్ తెలిపింది. ఢిల్లీలో పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా వచ్చే కాలుష్యం ప్రస్తుతం 2-3 శాతం ఉండగా, గతేడాది అత్యధికంగా 15 శాతం నమోదైందని గాలి నాణ్యత మరియు వాతావరణ అంచనా, పరిశోధనా వ్యవస్థ (ఎస్ఎఎఫ్ఎఆర్) తెలిపింది. కాలుష్య స్థాయి పిఎం 2.5 ప్రస్తుతం దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ సమీపంలో క్యూబిక్ మీటరుకు సుమారు 400 మైక్రో గ్రాములుగా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) నిబంధనల ప్రకారం .. సురక్షిత పరిధి ఐదు మైక్రోగ్రాముల కన్నా 80 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచి చాలా పేలవంగా ఉందని పేర్కొంది. బాణా సంచా పేల్చడం ద్వారా విడుదలయ్యే ఉద్గారాలతో పాటు పంట వ్యర్థాలను కాల్చివేయడం ద్వారా కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా మారుతున్నాయని నివేదిక పేర్కొంది. ఐక్యూఎఐఆర్ నివేదికపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఆసియాలోనే పది అత్యంత తీవ్రమైన కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ లేదని, భారత్లో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉందని ట్వీట్ చేశారు.