అసలుసిసలైన టీ20 క్రికెట్ మజా ఇవాళ (అక్టోబర్ 23) జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో దొరికింది. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా.. దాయాది పాక్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించి, ఆసియా కప్-2022, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ విశ్వరూపం (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రదర్శించి ఛేదనలో రారాజు తనేనని మరోసారి ప్రపంచానికి చాటాడు. కోహ్లి వీరోచిత పోరాటానికి హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన (40, 3/30) తోడవ్వడంతో భారత్ చిరకాలం గుర్తుండిపోయే అపురూప విజయాన్ని సాధించింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి (24).. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డును (23) అధిగమించాడు. <br><br>
అలాగే, రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (అంతర్జాతీయ టీ20ల్లో) రికార్డును కూడా కోహ్లి ఈ మ్యాచ్‌లోనే అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు టీ20ల్లో 3741 (143 మ్యాచ్‌ల్లో) పరుగులు చేయగా.. విరాట్ 110 ఇన్నింగ్స్‌ల్లోనే 3794 పరుగులు చేసి టీ20ల్లో టాప్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. ఈ జాబితాలో విరాట్, రోహిత్ తర్వాత మార్టిన్ గప్తిల్ (3531), బాబర్ ఆజమ్ (3231) ఉన్నారు.