బీసీసీఐ తాజా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్రికెట్ వర్గాలకు ఊహించని షాకిచ్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి మరోసారి ఆశించి భంగపడ్డ దాదా.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం కూడా నామినేషన్ వేయని దాదా.. సోదరుడు స్నేహాశిష్ గంగూలీ కోసం క్యాబ్ అధ్యక్ష పదవిని త్యాగం చేశాడు. గంగూలీ పోటీ నుంచి విరమించుకోవడం, పోటీలో ఎవరూ లేకపోవడంతో స్నేహాశిష్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో 2015 నుంచి విపక్ష వర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడం ఆనవాయితీగా వస్తుంది.
నాటి నుంచి 2019 వరకు గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా సేవలందించాడు. ఆ తర్వాత దాదా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడంతో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియా క్యాబ్ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. మరోవైపు క్యాబ్ ఉపాధ్యక్ష పదవి కోసం ఆమలేందు బిస్వాస్, సెక్రటరీ పదవి కోసం నరేష్ ఓఝా, జాయింట్ సెక్రటరీ పోస్టు కోసం దేబబ్రత దాస్, ట్రెజరర్ గా ప్రబీర్ చక్రవర్తి నామినేషన్లు వేశారు. ఈ పదవులకు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవం కానున్నాయి.