స్టెప్పులేసి సతీమణితో కలిసి పాట పాడిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
భోపాల్ : కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ ఏడాది దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. భోపాల్‌లోని తన నివాసానికి చిన్నారులను ఆహ్వానించిన సీఎం దంపతులు వారితో కలిసి ఆనందంగా గడిపారు. ఆ చిన్నారులతో కలిసి దీపాలు వెలిగించారు. అనంతరం వారితో సహపంక్తి భోజనం చేశారు. కొందరు చిన్నారులకు ఆయనే స్వయంగా తినిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం శివరాజ్‌సింగ్ పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తూ వారిని మరింత ఉల్లాసపరిచారు. అనంతరం కచేరి కార్యక్రమంలో తన సతీమణి సాధనా సింగ్‌తో కలిసి సీఎం గీతం ఆలపించిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
సీఎం కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కార్యక్రమంలో దాదాపు 315మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకల అనంతరం చిన్నారులు తమ ఆనందాన్ని పంచుకొని సీఎం దంపతులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిన్నారులతో దీపావళి వేడుకలు జరుపుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని సీఎం తెలిపారు. అయితే, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలాంటి వేడుకలను చిన్నారులతో కలిసి చేసుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. గతేడాది దీపావళి వేడుకలు, ఈ ఏడాది రక్షా బంధన్ వేడుకలు కూడా వారి సమక్షంలోనే నిర్వహించి వారిపట్ల తన ప్రేమను చాటుకున్నారు.